కుక్కల అరుపులతో బయటపడ్డ ఘోరం: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
దర్భంగాలో ఉద్రిక్తత.. నిందితుడి అరెస్ట్.. వేగంగా విచారణ జరుపుతామని జిల్లా కలెక్టర్ హామీ
దర్భంగా (బీహార్): బీహార్లోని దర్భంగా జిల్లాలో గుండె తరుక్కుపోయే విషాదం చోటుచేసుకుంది. ఒక ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా ఆదివారం జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రాత్రి సమయంలో ఆ ప్రాంతంలోని కుక్కలు అసాధారణంగా మొరుగుతుండటంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఒక గోడ పక్కన రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు.
నిందితుడి గుర్తింపు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ మహతో (22) అనే యువకుడు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా చీకటి ప్రదేశంలోకి లాక్కెళ్లినట్లు తోటి పిల్లలు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన తర్వాత పోలీసులు నిందితుడిని రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూలీగా పనిచేస్తున్నాడని, అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారులు తెలిపారు.
రోడ్ల దిగ్బంధం.. టైర్ల దహనం ఈ దారుణ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆదివారం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రోడ్లను దిగ్బంధించి, టైర్లను దహనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడం, రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
రెండు నెలల్లోనే శిక్ష పడేలా చర్యలు దర్భంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్ ఈ ఘటనను అత్యంత అమానుషమైనదిగా అభివర్ణించారు. బాధితురాలి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించడానికి ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసును ‘స్పీడీ ట్రయల్’ కింద విచారించి, రోజువారీ విచారణ జరిపి, రాబోయే రెండు నెలల్లోనే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, సున్నితమైన ప్రాంతాల్లో మెజిస్ట్రేట్లను నియమించామని ఆయన పేర్కొన్నారు.




